Brahma: ఆపరేషన్ బ్రహ్మ వెనుక రహస్యం ఇదే..! 5 d ago

భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు భారతప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మ పేరిట మానవతా సహాయాన్ని అందించింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని పంపింది.
అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ హాస్పిటల్ ను కూడా వాయుమార్గాన మయన్మార్ కు తరలించింది. మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూను తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. కమాండెంట్ పి.కె. తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్టీఆర్ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయి.
అసలు 'బ్రహ్మ అని పేరెందుకు పెట్టారు..?
"బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్ లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషనకు బ్రహ్మ అని పేరు పెట్టింది. 2024 లో యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్ కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించింది. నైబర్ హూడ్ ఫస్ట్ కింద మరియు వసుధైవ కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని నమ్మే భారత్ మన పొరుగున ఉన్న దేశాలకు విపత్కర పరిస్థితుల్లో మానవతా సహాయాన్ని అందిస్తుంది.